రేపు ఆశ్వయుజ శుద్ధ అష్టమి, దుర్గాష్టమి. నిత్యజీవితంలో ఎన్నో కష్టాలు, దుఃఖాలు, దారిద్ర్యం, భయం వెంటాడుతున్నాయని, ఇలాంటి క్లిష్టపరిస్థితులలో అమ్మ నామాన్ని స్మరించడం, గుణాల్ని కీర్తించడం, రూపాన్ని దర్శించడం వల్ల కష్టాలు అంతరించిపోతాయని దేవీ మహాత్మ్యం చెబుతోంది.
నిత్యజీవితంలో ఎన్నో కష్టాలు మనల్ని వెంటాడుతూ భయకంపితుల్ని చేస్తుంటాయి. దుఃఖసంద్రంలో ముంచి, మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తుంటాయి. దారిద్ర్యం తాండవిస్తూ నిరాశావాదమనే ఊబిలోకి నెట్టేస్తుంది.
ఇలాంటి క్లిష్టపరిస్థితులలో ఒక్కసారి అమ్మ నామాన్ని స్మరించడం, అమ్మ గుణాల్ని కీర్తించడం, అమ్మ రూపాన్ని దర్శించడం వల్ల ఎనలేని కష్టాలూ, అంతులేని అవాంతరాలూ అంతరించిపోతాయని దేవీ మహాత్మ్యం చెబుతోంది. మన దుఃఖాలు, దారిద్ర్యం, భయం పోగొట్టేందుకు దుర్గాదేవిని స్తుతించాలని ఈ గ్రంథం సూచిస్తోంది.
దేవీ మహాత్మ్యం (4-17) లోని శ్లోకం ప్రకారం, ఓ దుర్గా కష్టకాలంలో నిన్ను తలచుకున్న వారి భయాన్ని తొలగిస్తావు. సుఖసంతోషాలతో ఉన్నవారు నిన్ను స్మరిస్తే, వారికి అంతకన్నా అధికమైన శుభాలను కలుగజేసే బుద్ధిని ప్రసాదిస్తావు. దారిద్ర్యం, దుఃఖం, భయం పోగొట్టి అందరికీ ఆనందాన్నిచ్చే సున్నిత మనస్సు నీకు తప్ప వేరెవరికి కలదు తల్లీ అని అమ్మను కీర్తించారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న దుర్గమాసురుని సంహరించడం బ్రహ్మాది దేవతలకు కూడా దుర్గమమైంది. అప్పుడు దుర్గమాసురుని బారినుండి తమను రక్షించాల్సిందిగా ఋషులు పార్వతీదేవిని వేడుకున్నారు. కరుణాస్వరూపిణి అయిన అమ్మ మనస్సు కరిగి, దుర్గమాసురుని సంహరించింది. జగన్మాత, దుర్గమాసురుని సంహరించడం వల్ల దుర్గగా ఆరాధనలు అందుకుంటోంది. మనకు కలిగే దుర్గమమైన కష్టాలను సైతం అంతరింపజేస్తుంది.










