బుద్ధుడి బోధనలు, అంబేడ్కర్ ఆశయాలు, సామాజిక సమానత్వ నినాదాల నడుమ మండలంలో 70వ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బౌద్ధ ఉపాసకులు, అంబేడ్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బౌద్ధమత స్వీకరణ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు. బౌద్ధ విహారాలు, సామాజిక భవనాల వద్ద పంచశీల జెండాలను ఆవిష్కరించి గౌతమ బుద్ధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వీధుల్లో శోభాయాత్ర.. ఆకట్టుకున్న నృత్యాలు
ధమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని లో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గౌతమ బుద్ధుడు, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాలను ప్రతిష్ఠించి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. యువకులు, చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బౌద్ధ ఉపాసకులు, దళితులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రను తిలకించారు. బౌద్ధమత సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.
బుద్ధుడి బోధనలు నేటికీ ఆచరణీయం
గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన శాంతి, అహింస, కరుణ, మానవత్వ సందేశాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పలువురు పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమానత్వ భావనను ప్రజల్లో విస్తరించాలని ఆకాంక్షించారు. మండలంలోని వివిధ గ్రామాల్లోనూ బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసుల గట్టి బందోబస్తు
వేడుకలు ప్రశాంతంగా జరిగేలా నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ పి. సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో సీఐ జి. రవీందర్ నాయక్, ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.











