గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి బాసరలో గోదావరి నది పుష్కరాల పనులను పరిశీలించారు. పుష్కర ఘాట్లతో పాటు, నిర్మాణ పనుల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టాలని, వేలాది మంది పుణ్యస్నానాలకు తరలివస్తారని, వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కమిషనర్ సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాల పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు నాణ్యవంతంగా చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పుష్కరాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అవసరమైన మేరకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని, పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తమకు అందజేస్తూ ఉండాలని ఆదేశించారు.
పుష్కరాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బాసరలో గోదావరి పుష్కరాల పనులన్నీ నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. పుష్కరాల పనుల వివరాలను కలెక్టర్ కమిషనర్ కు వివరించారు. వారానికి ఒకరోజు బాసరలో పుష్కర పనులపై సమీక్ష నిర్వహించడంతో పాటు, పనులకు సంబంధించి అధికారులందరికీ దిశా నిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి నది పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేస్తామని, పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.










