రాజన్న క్షేత్రం వేములవాడలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో గౌరీదేవి అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మవారి వాహనాన్ని స్వయంగా నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన గౌరీదేవి అమ్మవారి శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా సాగి మూలవాగు వద్దకు చేరుకుంది. అక్కడ అమ్మవారిని సంప్రదాయబద్ధంగా కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలు, భక్తి గీతాల నడుమ పట్టణ వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి వాహనాన్ని స్వయంగా నడిపి మూలవాగు వరకు తీసుకెళ్లారు. ఈ దృశ్యం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. వేములవాడ ప్రజలు సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు, మహిళా సోదరీమణులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ, పట్టణంలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని, వేములవాడలో మాత్రం ఏడో రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. ఈ విధానం మహిళలు పుట్టింట, అత్తింట సంతోషంగా పండుగ జరుపుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మూలవాగు వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం విద్యుత్ దీపాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రతకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. మహిళలు, భక్తులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ప్రకృతి సిద్ధమైన పూలతో బతుకమ్మలను పేర్చి గౌరీదేవిని ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో విశిష్టమైన సంప్రదాయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలతో వేములవాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ మేనేజర్ సంపత్ రెడ్డి, పారిశుధ్య తనిఖీ అధికారి సుకుమార్, పాలకవర్గ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










