కనకాపూర్ గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని పూలమాలలు, సుగంధ పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, అమ్మవారి కృపాకటాక్షాలు తమ కుటుంబాలపై ఉండాలని ప్రార్థిస్తున్నారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్య ప్రదాయినిగా పూజలందుకునే శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.










