లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. యాసంగి పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెళకువలు, నాణ్యమైన దిగుబడులు సాధించే పద్ధతులపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, పంటల సాగులో శాస్త్రీయ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంటలలో చీడపీడల నివారణ, ఎరువుల సమతుల్య వినియోగం, నీటి యాజమాన్యం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పద్ధతులను అందిపుచ్చుకోవడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని, అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి చెర్రిన్ గగన్ నర్సారెడ్డి, ఇఫ్కో మేనేజర్ బాలవికాస్ రెడ్డి పాల్గొన్నారు.












