ప్రముఖ జల నిర్వహణ నిపుణుడు, వ్యవసాయ ఇంజనీర్ గగ్గనపల్లి వెంకటరమణారెడ్డికి ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ (ఐఎస్ఏఈ) ప్రతిష్టాత్మక ఫెలోషిప్, ప్రశంస పత్రాలను అందజేసింది. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన సెమినార్ లో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.
వ్యవసాయ ఇంజనీరింగ్ రంగంలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ ఫెలోషిప్ ను వెంకటరమణారెడ్డికి అందజేశారు. ఆయన 1992 లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటిపారుదల వ్యవస్థల రంగంలో తన వృత్తిని ప్రారంభించారు. క్షేత్రస్థాయి అనుభవాలను ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా రైతుల జీవితాలను మెరుగుపరచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాలలో పర్యటించి, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికతలపై, జల నిర్వహణ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేశారు. దేశ విదేశాలలో సూక్ష్మ నీటిపారుదల సాంకేతికతలపై వందలాది సెమినార్లు నిర్వహించారు. వ్యవసాయ యువ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో వెంకట రమణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ వారు ఆయన కృషిని గుర్తించి 2026 ఫెలోషిప్ ను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, యువ వ్యవసాయ ఇంజనీర్లకు సూక్ష్మ నీటిపారుదల రంగంలో ఆధునికతపై అవగాహన కల్పిస్తానని తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో లాభదాయకమైన పంటలు పండించుకునే విధంగా అన్నదాతలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఐఎస్ఏఈ ఫెలోషిప్ ను అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.












