నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో నిర్మల్ జిల్లాలో పత్తి సహా వివిధ పంటలు ఎండిపోతున్నాయి. పంటలు చేతికందే సమయంలోనే వర్షాభావ పరిస్థితులతో దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం కాల్వతండాతో పాటు పలు గ్రామాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
పత్తి పంటకు సరైన సమయంలో వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని రైతులు తెలిపారు. పంట చేతికొచ్చే దశలో ఎండల తీవ్రత పెరగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందని వాపోతున్నారు. పత్తితో పాటు సోయాబీన్, వరి, మొక్కజొన్న తదితర పంటలు కూడా ఎండిపోతుండటంతో పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది పొడవునా పంట కోసం శ్రమించి పెట్టుబడులు పెట్టామని, తీరా పంట చేతికందే సమయంలో వర్షాభావం వెంటాడటంతో తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటలు ఎండిపోతుండటాన్ని చూసి రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై సమగ్రంగా పరిశీలన చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని మహిళా రైతులు, ఇతర రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.












