బైంసా ముథోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గోదావరి జలాలను అందించి, రైతుల పొలాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 28వ ప్యాకేజీ పనులు త్వరగా ప్రారంభమై పూర్తికావాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకాంక్షించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకుని, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 28వ ప్యాకేజీకి సంబంధించిన పత్రాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి, ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు, నిధులు మంజూరు కావాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 28వ ప్యాకేజీ పూర్తయితే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలను వినియోగించి ముథోల్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. దీంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గి, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నియోజకవర్గ అభివృద్ధికి కీలకమని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 28వ ప్యాకేజీ పనుల కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నిధులు త్వరగా లభించి పనులు పూర్తయితే నియోజకవర్గంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గోదావరి జలాలు ప్రతి గ్రామానికి చేరి, బీడు భూములు సైతం సాగులోకి వచ్చి, పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రైతుల జీవితాల్లో సంతోషం నింపడమే తన ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.












