నిర్మల్, 16 October
జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపు జరగనున్న మూల నక్షత్రం మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది.
జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపు జరగనున్న మూల నక్షత్రం మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల భద్రత దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బాసరలోని ఎం.కె. కన్వెన్షన్ హాల్లో బందోబస్తు విధులకు హాజరైన సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి విధుల నిర్వహణపై బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద భద్రత, నది ప్రవాహ ఉధృతి పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రతి పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మూల నక్షత్రం మహా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు. భక్తులు పోలీసులకు సహకరించి, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకొని తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










