హైదరాబాద్, 15 September
సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలి
సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలి నైజాం వ్యతిరేక పోరాట చరిత్రను వక్రీకరించొద్దు తెలంగాణ సాయుధ పోరాటం త్యాగాలను గుర్తించాలి తెలంగాణ: సెప్టెంబర్ 17ను విలీన దినంగా, విమోచన దినంగా కాకుండా విద్రోహ దినంగా పాటించాలని వామపక్ష భావజాలానికి చెందిన నాయకులు పేర్కొన్నారు. నాటి నైజాం పాలనలో ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు లేకుండా వెట్టి చాకిరి, నిర్బంధాలు, అధిక పన్నులతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. నైజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, జాగీర్దార్లు వంటి భూస్వామ్య వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై ఆధిపత్యం చెలాయించేవారని పేర్కొన్నారు. ప్రజల నుంచి అధిక మొత్తంలో పన్నులు, పలు రకాల వసూళ్లు చేసేవారని ఆరోపించారు. జాగీరు ప్రాంతాల్లో దోపిడీ, అణచివేత మరింత తీవ్రంగా ఉండేదని తెలిపారు. 3 వేల గ్రామాల్లో పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. సుమారు 3 వేల గ్రామాలను నైజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేశారని తెలిపారు. భూస్వాముల ఆధీనంలో ఉన్న సుమారు 10 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచినట్లు వివరించారు. ఈ పోరాటం ఫలితంగా పలు గ్రామాల్లో వెట్టి చాకిరి నిర్మూలన, భూస్వాముల దోపిడీకి అడ్డుకట్ట, అంటరానితనం నిర్మూలన వంటి సామాజిక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. తరతరాలుగా బానిసత్వంలో మగ్గిన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను అనుభవించారని, గ్రామస్థాయిలో ప్రజలు పాలనలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. తమ భాష, సంస్కృతులను పునరుజ్జీవింప చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. పోలీసు చర్యపై విమర్శలు నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ‘పోలీసు చర్య’ పేరుతో హైదరాబాద్ సంస్థానంలో సైన్యాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల సాయుధ పోరాటాన్ని అణచివేసిందని నాయకులు ఆరోపించారు. అనంతరం భూస్వాములకు అనుకూలంగా పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పోరాటంలో భాగంగా పేదలకు పంచిన భూముల్లో కొంత భాగం తిరిగి భూస్వాముల చేతుల్లోకి వెళ్లిందని, ఉద్యమకారులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారని ఆరోపించారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను, పోరాట యోధుల త్యాగాలను గుర్తించి సెప్టెంబర్ 17ను ‘విద్రోహ దినం’గా పాటించాలని వారు పిలుపునిచ్చారు.












