నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో దుర్గమ్మ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వైభవంగా అలంకరించిన వాహనాల్లో గ్రామాల్లోని వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. ఈ శోభాయాత్రలో మహిళలు మంగళహారతులు చేతబూని పాల్గొనగా, భాజా భజంత్రీల నడుమ వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. అనంతరం ఆయా గ్రామాల సమీపంలోని చెరువులు, గోదావరి నదిలో దుర్గమ్మ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.











