నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంతో పలు గ్రామాల్లో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తొమ్మిది రోజుల అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా, మండలంలోని పిప్రి గ్రామంలో పురోహితులు నరసింహ స్వామి ఆధ్వర్యంలో, విగ్రహ దాతలైన మైస వినోద్, నిఖిత దంపతుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, విగ్రహ ప్రతిష్టాపన గావించారు.
అమ్మవారికి నైవేద్యం, తీర్థ ప్రసాదాల పంపిణీ
విగ్రహ ప్రతిష్టాపన అనంతరం గ్రామ యువకులు అమ్మవారి మాల ధరించారు. తదనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










