నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి హెచ్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహాప్రసన్న జగజ్జనని జగదీశ్వరి దేవి సత్య కర్ర దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బాసర వేదభారతి పీఠానికి చెందిన కన్యాస్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని కొలువుదీర్చారు.
అనంతరం అమ్మవారికి ప్రత్యేక హారతి సమర్పించి భక్తులకు దివ్యజ్యోతిని అందజేశారు. తొలిరోజు నుంచే వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి సత్య కర్ర దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
యువత ఆధ్వర్యంలో దుర్గమ్మ మాలధారణ
గ్రామ యువత ఆధ్వర్యంలో దుర్గమ్మ మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదమంత్రాల నడుమ అమ్మవారి ప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజలతో సిరిపెల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.










