నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జ్ఞాన సరస్వతి అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకార దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
శైలపుత్రి అమ్మవారి ప్రాశస్త్యం
శరన్నవరాత్రుల్లో తొలి రోజున పూజలందుకునే శైలపుత్రి అమ్మవారు దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో మొదటి రూపంగా పూజలందుకుంటారు. సతీదేవి యోగాగ్నిలో తనువు చాలించిన అనంతరం పర్వతరాజైన హిమవంతుని కుమార్తెగా అవతరించడంతో ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వృషభ వాహనంపై కొలువుదీరిన అమ్మవారు కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలాన్ని ధరించి, శిరస్సుపై చంద్రవంకతో దర్శనమిస్తారు. శైలపుత్రి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే మనోవాంఛలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ప్రత్యేక నైవేద్యం
శరన్నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా శైలపుత్రి అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రార్థనా శ్లోకం
శైలపుత్రి అమ్మవారి ప్రార్థనా శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ఓం శైలపుత్రీ రూప సరస్వత్యై నమః










