బైంసా మూలా నక్షత్రం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న నిర్వహించనున్న వేడుకల నేపథ్యంలో ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
మూలా నక్షత్రం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఏఎస్పీ సూచించారు. భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ నెల 16న నిర్వహించనున్న మూలా నక్షత్రం వేడుకల నేపథ్యంలో, శనివారం ఏఎస్పీ సాయి కిరణ్, బాసర ఇన్స్పెక్టర్ దీపక్, ముథోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్తో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. భక్తుల రాకపోకల మార్గాలు, రద్దీ నియంత్రణ చర్యలు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ముందస్తు బందోబస్తు ప్రణాళికను సమీక్షించారు. విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనాదేవి, ఇతర ఆలయ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










