మండలం సిరిపెల్లి (హెచ్ ) గ్రామంలో కొలువైన శ్రీశ్రీశ్రీ మహాప్రసన్న జగత్ జనని జగదీశ్వరి దేవి సత్య కర్ర దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. అమ్మవారి సన్నిధిని కొలువుదీర్చేందుకు యువకులు అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి, పూలు, దీపాలతో అలంకరించి, ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు.
ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక పూజలతో అమ్మవారిని ఆరాధించేందుకు గ్రామస్థులు సిద్ధం చేశారు. 2012లో టేకు దుంగతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించినట్లు గ్రామస్థులు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
భక్తుల తాకిడి
సిరిపెల్లి (హెచ్ ) కర్ర దుర్గామాతను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. యువకులు సమష్టిగా ముందుకు వచ్చి అమ్మవారి సన్నిధిని ముస్తాబు చేయడం గ్రామస్థులను, భక్తులను ఆకట్టుకుంది.
నవరాత్రి వేళ అమ్మవారి నామస్మరణ, పూజలు, భజనలతో సిరిపెల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.










