నిర్మల్ జిల్లా, బాసర, అక్టోబరు 7: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సూపరింటెండెంట్ ఓని సంజీవరావు విధి నిర్వహణ సమయంలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. మంగళవారం ఉదయం బాసర బజార్ గల్లీలోని ఒక దుకాణం వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్న ఛాయాచిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.
దసరా నేపథ్యంలో బాసర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగిన సమయంలో అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని భక్తులు పేర్కొన్నారు. విధి నిర్వహణ సమయంలో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని అభిప్రాయపడ్డారు.
గతంలోనూ ఆరోపణలు
సూపరింటెండెంట్ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ గతంలోనూ ఆరోపణలు వచ్చాయని కొందరు పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఈవో వివరణ
ఈ విషయంపై ఆలయ ఈవో అంజనాదేవిని వివరణ కోరగా, విధి నిర్వహణ సమయంలో సిబ్బంది ఎవరూ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఛాయాచిత్రాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారిస్తామని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.










