తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త చైర్మన్ గా పారిశ్రామికవేత్త శ్రీనివాస రామానుజం పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు పదవీకాలం ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఒక క్షణం ఉన్నా జన్మ ధన్యం అని భక్తజనం కోట్లాదిగా తరలి వస్తుంది. అలాంటి చోట స్వామి సేవలో తరించడానికి టీటీడీ చైర్మన్ పదవిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక తొలి అవకాశం ఒక టీవీ అధిపతి అయిన బీఆర్ నాయుడుకు దక్కింది. ఆయన పదవీకాలం ఈ నెల 5వ తేదీకి పూర్తి అవుతోంది. అంటే సరిగ్గా నెల రోజుల వ్యవధిలో పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త చైర్మన్ ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. గత కొంతకాలంగా రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, ఒక పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
శ్రీనివాస రామానుజం నేపథ్యం
శ్రీనివాస రామానుజం అసలు పేరు లోకాద్రినాయుడు. ఆయన జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. ఆయనకు శ్రీనివాస రామానుజం అనే పేరును చిన్న జీయర్ స్వామి పెట్టారని, ఆయన రామానుజ మతాన్ని స్వీకరించారని చెబుతున్నారు. అంతేకాకుండా, ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. ఆయనకు బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఒక ముఖ్యమైన హోమాన్ని కూడా ఈయనే పర్యవేక్షించారు.
ఎంపికకు కారణాలు
తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక క్షేత్రం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హిందువులకు ఇది ఎంతో గొప్ప క్షేత్రంగా పేరుగాంచింది. అలాంటి టీటీడీకి పాలకమండలి చైర్మన్గా ఆధ్యాత్మిక నిష్ఠతో ఉండేవారిని నియమించాలని భావిస్తున్నారు. అందుకే శ్రీనివాస రామానుజం పేరును ఏరికోరి ఎంపిక చేశారని అంటున్నారు. ఈ పదవి రేసులో ఎంతో మంది పేర్లు వినిపించినా, ఆయన ఆధ్యాత్మిక భావనల పట్ల కూటమి పార్టీలన్నీ సంతృప్తిగా ఉన్నాయని, అందుకే ఆయన వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు. ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్దలను కూడా సంతృప్తి పరచవచ్చనే ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.
వివాదాలకు తావులేకుండా
టీటీడీ దైనందిన వార్తలలో వివాదాస్పదంగా ఉండకూడదనేది కూటమి పట్టుదల. ఏ చిన్న విషయం జరిగినా సరే, అది పెద్దదిగా మారుతోంది. అందుకే అక్కడ ఆధ్యాత్మికతను మరింతగా పాదుకొల్పాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సరైన పాలకుడి చేతిలో బోర్డును పెట్టాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. అందుకే అందరి మదిలో మెదిలిన ఏకైక పేరు శ్రీనివాస రామానుజం అని అంటున్నారు. బీఆర్ నాయుడు పదవీకాలం పూర్తి అయిన వెంటనే శ్రీనివాస రామానుజం ఈ పదవిలోకి వస్తారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది.










