బాసర పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో అంజనీ దేవి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆమె చెప్పారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారు తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధానార్చకులు సంజీవ్ పూజారి ఈ వివరాలు వెల్లడించారు. మొదటి రోజు శైలపుత్రి, 12న బ్రహ్మచారిణి, 13న చంద్రఘంట, 14న కూష్మాండ, 15న స్కందమాత, 16న కాత్యాయని, 17న కాళరాత్రి, 18న మహాగౌరి, 19న సిద్ధిదాత్రి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ నెల 16న అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అక్షర శ్రీకర పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలు చిన్నారుల విద్యాభివృద్ధికి దోహదపడతాయని భక్తుల విశ్వాసం. అక్షర స్వీకార పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని అర్చకులు కోరారు.
నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజులపాటు ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించనున్నారు.
ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఈవో అంజనీ దేవి తెలిపారు. మండపాలు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి పనుల కారణంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే పలు సేవలను కూడా రద్దు చేశారు. ఈ సమావేశంలో ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శివరాజ్, సంజీవరావు, పీఆర్వో నారాయణ పటేల్, సిబ్బంది పాల్గొన్నారు.










