గోవుల విశిష్టత, పర్యావరణ పరిరక్షణ, భారతీయ సంస్కృతిపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గోవిజ్ఞాన పరీక్షలకు సంబంధించిన అధ్యయన సామగ్రిని సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అందజేశారు. నిర్మల్ జిల్లా గోసేవ ప్రముఖ్ కొత్తకాపు నారాయణ ఈ సామగ్రిని విద్యార్థులకు అందించారు.
ఈ సందర్భంగా కొత్తకాపు నారాయణ మాట్లాడుతూ.. గోవు కేవలం ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదని, పర్యావరణ సమతుల్యత, ప్రకృతి వ్యవసాయం, మానవ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. దేశవాళీ గోవుల ప్రత్యేకత, పంచగవ్యాల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణలో గోవుల పాత్రపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గోవిజ్ఞాన పరీక్షలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో గ్రామస్థాయిలో, రెండో దశలో జిల్లా స్థాయిలో, మూడో దశలో రాష్ట్ర స్థాయిలో పరీక్షలు జరుగుతాయని వివరించారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేల నగదు బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు. పరీక్షకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధ్రువపత్రం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆరవ తరగతి ఆపై చదువుతున్న విద్యార్థులతో పాటు 10 సంవత్సరాలు పైబడిన అన్ని వర్గాల ప్రజలు ఈ పరీక్షల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. గోవిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, కల్లూరు ఖండ్ బౌద్ధిక్ ప్రముఖ్ బండారి గజేందర్ తదితరులు పాల్గొన్నారు.










