జగిత్యాల బస్‌స్టేషన్ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. ప్రయాణికుడు పోగొట్టుకున్న సుమారు రూ.80 వేల నగదు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర వస్తువులను గుర్తించి, అతనికి తిరిగి అందజేశారు. ఈ ఘటనతో ప్రయాణికుడు ఆనందం వ్యక్తం చేశారు.
కాజీపేటకు చెందిన సిరిమల్లె ప్రవీణ్, వరంగల్ నుంచి డీలక్స్ బస్సులో ప్రయాణిస్తున్నారు. హుజూరాబాద్ బస్‌స్టేషన్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చేలోగా బస్సు బయలుదేరింది. దీంతో తన బ్యాగు, అందులోని సుమారు రూ.80 వేల నగదు, సెల్‌ఫోన్, పర్సు, ఇతర వస్తువులు బస్సులోనే ఉండిపోయాయని గుర్తించారు. హుజూరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే డీలక్స్ బస్సు అయి ఉంటుందని భావించిన ప్రవీణ్, జగిత్యాల బస్‌స్టేషన్ సిబ్బందిని సంప్రదించారు. అయితే, ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడంతో బస్సు వివరాలు స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, జగిత్యాల బస్‌స్టేషన్ మేనేజర్ ఎన్. రమేష్ అనుమతితో సిబ్బంది బృందం వివిధ డీలక్స్ బస్సుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. చివరకు, ప్రయాణికుడు తెలిపిన వివరాలకు సరిపోయే బ్యాగు, పర్సు, సెల్‌ఫోన్ తదితర వస్తువులను ఒక డీలక్స్ బస్సులో గుర్తించారు.
అనంతరం, ప్రవీణ్‌కు సమాచారం అందించి, అతని సమక్షంలో బ్యాగులోని వస్తువులను పరిశీలించి, వీడియో రికార్డింగ్ చేశారు. సుమారు రూ.80 వేల నగదు, సెల్‌ఫోన్, పర్సు, బ్యాగుతో పాటు అందులోని ఇతర వస్తువులను ప్రవీణ్‌కు అప్పగించారు. తన పోగొట్టుకున్న విలువైన వస్తువులు సురక్షితంగా తిరిగి లభించడంతో ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేశారు. జగిత్యాల బస్‌స్టేషన్ మేనేజర్, సిబ్బంది సమన్వయంతో పనిచేసి తనకు వస్తువులు తిరిగి అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల సేవే లక్ష్యంగా నిజాయితీతో పనిచేసిన సిబ్బందిని పలువురు అభినందించారు.












