సత్యం, అహింస, ధర్మం లేని సమాజంలో శాంతికి గాంధీ ఆలోచనలే మార్గదర్శకం అని ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. గాంధీజీని కేవలం విగ్రహాలకే పరిమితం చేయకుండా, ఆయన సిద్ధాంతాలను మన జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంది.
సత్యం లేని చదువు, ప్రేమ లేని ఇల్లు, ధర్మం లేని రాజకీయం ఉన్నంతకాలం సమాజానికి శాంతి ఎక్కడ రాగానే గాంధీజీ గుర్తుకొస్తారు. విగ్రహాలకు పూలమాలలు వేస్తాం, చిత్రపటాలకు నివాళులు అర్పిస్తాం. సత్యం, అహింస, స్వచ్ఛతపై ప్రసంగాలు చేస్తాం. కానీ మరుసటి రోజే మళ్లీ అదే కోపం, అదే మోసం, అదే అవినీతి, అదే కుటుంబ కలహాలు, అదే రాజకీయ ఆరోపణలు. గాంధీని విగ్రహంలో పెట్టుకున్నామా గుండెల్లో పెట్టుకున్నామా గాంధీజీకి సత్యం ప్రసంగ పదం కాదు, జీవిత ప్రయోగం. సత్యాగ్రహం అంటే తప్పు ముందు తలవంచకుండా నిలబడే నైతిక ధైర్యం. అహింస అంటే ఎదుటివాడిని కొట్టకపోవడమే కాదు, ఎదుటివాడిలోనూ మనిషిని చూడడం. విగ్రహం ముందు తలవంచడం సులువు, మన తప్పు ముందు తలవంచడం కష్టం.
రాజకీయాల్లో ధర్మం, జవాబుదారీతనం అవసరం
ఇది ముఖ్యంగా రాజకీయాలకు వర్తిస్తుంది. గాంధీజీకి రాజకీయాలు అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం పాలనకు జవాబు చెప్పాలి. ప్రతిపక్షం ఆధారాలతో ప్రశ్నించాలి. ప్రజల సొమ్ము ఎలా ఖర్చవుతోంది పథకం ఎందుకు ఆలస్యమైంది పని నాణ్యత ఎలా ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలి. అవినీతి, భూకబ్జాలు, కల్తీ వ్యాపారాలు, పోలీసు పైరవీలు, సెటిల్మెంట్లు రాజకీయ పలుకుబడితో నడుస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోపణ వస్తే విచారణ జరగాలి. ఆధారం ఉంటే చట్టం తన పని తాను చేయాలి. ఆధారం లేకుండా ఎవరినీ నేరస్తుడిగా ముద్ర వేయకూడదు. వ్యక్తి ఎవరు అన్నది కాదు, నిజం ఏమిటన్నదే ముఖ్యం.












