విమానాన్ని మధ్య గగనతలంలో హైజాక్ చేసి 9/11 తరహా ఘటనకు పాల్పడే ప్రయత్నాన్ని తన ధైర్యసాహసాలతో అడ్డుకున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. దక్షిణ ఢిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లో ఉన్న ఆర్య సమాజ్ మందిర్సంత్ నగర్లో శుక్రవారం ఉదయం ఈ యజ్ఞం జరిగింది.
విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ మాట్లాడుతూ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ధైర్యసాహసాలను కొనియాడారు. విమానం సుమారు 32 వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ, తన ప్రాణాలను లెక్కచేయకుండా పరిస్థితిని ఎదుర్కొన్నారని తెలిపారు.
విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులకు సహాయం అందేలా కాక్‌పిట్ తలుపు తెరవడంలో కీలక పాత్ర పోషించారని, వేగంగా ఎత్తు కోల్పోతున్న విమానాన్ని సురక్షితంగా నియంత్రించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ ఘటన మానవ భద్రత, శాంతి, సంక్షేమం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసే ధైర్యానికి నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు.
కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి పరామర్శించడం, ఆయన ధైర్యసాహసాలను ప్రశంసించడం అభినందనీయమని వినోద్ బన్సల్ తెలిపారు. ఇతర దేశాల ప్రముఖులు కూడా భారతీయ పైలట్ ధైర్యాన్ని ప్రశంసించారని ఆయన పేర్కొన్నారు.
యజ్ఞాన్ని నిర్వహించిన దర్శనాచార్య విమలేష్ ఆర్య మాట్లాడుతూ, ఈ ఘటన చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ మంత్రి డాక్టర్ వరుణ్ కుమార్, కోశాధికారి వీరేంద్ర సూద్, ధర్మకర్త సంజయ్ సికరియా, సంరక్షకుడు విజయ్ పాల్ కౌశిక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతినిధులు ప్రభాత్ రమణ్, టేక్రాజ్, సేవా భారతి ప్రతినిధి ప్రకాశ్ మిశ్రా, కమలా నెహ్రూ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ అంకుర్ రాజ్, స్థానిక సంక్షేమ సంఘాలు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
గమనిక: పై వార్తలో విమాన ఘటనకు సంబంధించిన ఆరోపణలు, వ్యాఖ్యలను సంబంధిత సంస్థ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ఆధారంగా అందించాం.












