మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ ఆలోచనలు, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని సూచించారు. సమాజంలో నిజాయితీ, నీతి, ప్రేమ, మానవతా విలువలను పెంపొందించుకోవాలంటే గాంధీజీ ఆలోచనలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత తరానికి గాంధీజీ సిద్ధాంతాలను పరిచయం చేయడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సత్యం, అహింస వంటి విలువలతోనే సమాజంలో శాంతి, సామరస్యం నెలకొంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబాహన్, అహమ్మద్ హుస్సేన్, అశోక్ కుమార్, సతీష్, ఆదినారాయణ, హేమంత్‌తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.











