మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండలి నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, డీజే మిక్సర్లు, హైఫై సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని, రాత్రి 10 గంటలకు లౌడ్స్పీకర్లు నిలిపివేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ భద్రత, నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మండలి నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ మేరకు సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
గణేష్ మండపాల ఏర్పాటులో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండపం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల నుంచి బలవంతంగా విరాళాలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. మండపాల వద్ద మహిళలు, యువతులపై వేధింపులు జరగకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఉత్సవాల్లో డీజేలు, డీజే మిక్సర్లు, హైఫై సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మైక్ వినియోగానికి సంబంధిత ఏసీపీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. లౌడ్స్పీకర్లను రాత్రి 10 గంటలకు తప్పనిసరిగా నిలిపివేయాలని, సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మండపాల వద్ద విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరగకుండా నాణ్యమైన వైర్లు ఉపయోగించాలని, ప్రతి చోట ఎంసీబీలు ఏర్పాటు చేయాలని సూచించారు. లైటింగ్ కోసం పీవీసీ పైపుల ద్వారా సురక్షితంగా వైరింగ్ చేయాలని, నాణ్యమైన కవర్లతో ఉన్న ఫ్లడ్లైట్లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు మండపాల వద్ద రెండు బకెట్ల నీరు, రెండు బకెట్ల ఇసుక, ఫైర్ బాల్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో మండపాలపై నాణ్యమైన రేకులు, ప్లాస్టిక్ కవర్లతో షెడ్లు ఏర్పాటు చేసి వర్షపు నీరు లోపలికి రాకుండా చూడాలని తెలిపారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసే వేదిక పటిష్ఠంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గణేష్ విగ్రహం నిమజ్జనం చేసే రోజు, ప్రదేశం, మార్గానికి సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు. నిమజ్జన సమయంలో పోలీసులు సూచించిన మార్గాల్లో క్రమపద్ధతిలో వెళ్లాలని, వాహనాలను నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలని పేర్కొన్నారు.
చెరువులు, కాలువలు, బావులు, గోదావరి తదితర నీటి వనరుల్లో నిమజ్జనం చేసేటప్పుడు పెద్దలు మాత్రమే పాల్గొనాలని, ఈత వచ్చిన వారు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. చిన్నపిల్లలను నిమజ్జన ప్రాంతాలకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
నిమజ్జనం సమయంలో ఎలాంటి విన్యాసాలు చేయరాదని, సెల్ఫోన్లతో సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. భారీ విగ్రహాలను తరలించే మార్గంలో విద్యుత్ తీగలు, రహదారి ఎత్తు తదితర అంశాలను ముందుగానే పరిశీలించాలని సూచించారు.












