సిద్దిపేట, 10 November
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఐక్యంగా ముందుకు సాగుతూ, రాజ్యాంగబద్ధమైన హక్కులు, సమాన అవకాశాలు, జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా సాధించుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రాష్ట్ర నాయకులు బత్తుల చంద్రం పిలుపునిచ్చారు.
సిద్దిపేట పట్టణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సభ, నూతన టౌన్ కమిటీ నియామకం, ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించి, సభ్యులను ఘనంగా సన్మానించారు. సిద్దిపేట పట్టణ అధ్యక్షుడిగా రాజు గౌడ్‌ను నియమించారు.
ఈ సందర్భంగా బత్తుల చంద్రం మాట్లాడుతూ.. మేమంతా మాకంత వాటా అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజనులందరూ ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలు సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.






