రైతు ఎదిగితేనే దేశం ఎదుగుతుంది అనే నినాదంతో కొడంగల్ లో నిర్వహించిన మెగా రైతు మేళా - ఇండస్ట్రియల్ ఎక్స్పో 2026 కార్యక్రమానికి వనపర్తి జిల్లా గోపాల్పేట, ఎదుల మండలాలలోని వివిధ గ్రామాల నుండి రైతులు, మహిళా సంఘాల సభ్యులు భారీగా తరలివెళ్లారు. గోపాల్పేట ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సత్యశీలా రెడ్డి, గోపాల్పేట టౌన్ అధ్యక్షులు ధన్వాడ నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో గోపాల్పేట మండలంలోని పోల్కేపాడు, లక్ష్మీదేవిపల్లి, తాడిపర్తి, బుద్ధారం, చాకలిపల్లి, చెన్నూర్, ఎదుట్ల, తిరుమలాపూర్, మండలంలోని అనంతపురం, చీర్కపల్లి, చెన్నారం, మాచుపల్లి, సింగాయ్యపల్లి తదితర గ్రామాల నుండి మొత్తం 6 బస్సుల్లో దాదాపు 380 మంది రైతులు, మహిళలు మెగా రైతు మేళా వేదికకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మార్కెట్ ఉపాధ్యక్షులు సత్యసిల్లారెడ్డి మాట్లాడుతూ, కొడంగల్లో రైతులకు వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మెగా కిసాన్ మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ, సూక్ష్మ సేద్య పద్ధతులు, పాలీహౌస్ సాగు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, పంటల కోత అనంతర నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ మరియు మార్కెటింగ్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే, వ్యవసాయానికి సంబంధించిన వివిధ యంత్రాలు, పరికరాలు, డ్రోన్లు, ఆధునిక సాగు పద్ధతులను రైతులు ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శన శాలల ద్వారా వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఆధునిక యంత్ర పరికరాల సహాయంతో వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవడం వంటి విషయాలపై ఈ మేళా రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు వివిధ ప్రదర్శనశాలలను సందర్శించి వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాంకేతిక విధానాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ప్రయోజనకరమని, రెండు మండలాల రైతులు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మెగా ఎక్స్పోను విజయవంతం చేయడం పట్ల నిర్వాహకులు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
రైతులు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలనే విషయంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూ, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెంది, పట్టణాలు, జిల్లా, రాష్ట్రం అభివృద్ధితో దేశం సర్వతోముఖాభివృద్ధిలో నడుస్తుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సభకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో గోపాల్పేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సుతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, మహిళా సంఘాల పేరు మీద బస్సులు ఇచ్చి, ఆర్థికంగా మహిళలు ఎదిగే విధంగా అన్ని విధాలుగా ఆదుకునే విధంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.






