వేములవాడ, 9 November
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో 10 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మహిళా సమాఖ్య సంఘాన్ని, మారుపాక గ్రామంలో వ్యవసాయ గోదాం ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు, నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రైతు సంక్షేమానికి జవహర్లాల్ నెహ్రూ హయాంలో ప్రారంభమైన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నుంచి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఎల్లంపల్లి, జూరాల, ఎల్ఎండీ, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులు వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
గతంలో రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర లభించక ఇబ్బందులు పడుతున్న సమయంలో 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,400కు పైగా కనీస మద్దతు ధర లభిస్తున్న నేపథ్యంలో, రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తే రైతులు అక్కడ విక్రయించుకోవచ్చని, లేకపోతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పేదల భూములకు అన్యాయం జరగనివ్వను
పేదల సంక్షేమం, నిరుపేదలకు న్యాయం చేయడమే తన ప్రథమ కర్తవ్యమని, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మర్రిపల్లి గ్రామానికి సంబంధించిన భూములపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని అన్నారు. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
గతంలో 2015, 2016 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి ఇప్పటికే వివిధ ప్రభుత్వ అవసరాలకు కేటాయింపులు జరిగాయని వివరించారు. 40 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలోనే వివిధ అవసరాలకు వెళ్లాయని తెలిపారు. పేదల పక్షాన నిలబడటమే తన లక్ష్యమని, భూముల వ్యవహారంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి అంశాన్ని పారదర్శకంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మర్రిపల్లి చెరువును గత పదేళ్ల పాలనలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని విప్ ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం చెరువు పనులను పూర్తి చేసి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించి, ప్రజల మన్ననలు పొందుతుందనే ఉద్దేశంతోనే కొందరు కావాలనే పనులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విప్ ఆరోపించారు. రైతులకు మేలు చేసే అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా చూడాలని, మర్రిపల్లి చెరువు పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అడ్డంకులు సృష్టించడం మానుకోవాలని సూచించారు.






