చిన్నకొడూర్, 10 November
పిల్లల హక్కులను పరిరక్షిస్తూ, వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ప్రతినిధి రేష్మ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్, డీసీపీఓ ఆదేశాల మేరకు మండలం చంద్లాపూర్ గ్రామంలో సర్పంచ్ సురగోని శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేష్మ మాట్లాడుతూ, పిల్లలను పనుల్లో పెట్టకుండా చూడాలని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామానికి వలస వచ్చిన కుటుంబాల పిల్లలను సైతం పాఠశాలల్లో చేర్పించేలా కమిటీ సభ్యులు కృషి చేయాలని ఆమె కోరారు. ఉమెన్ హబ్ ప్రతినిధి పద్మ మాట్లాడుతూ, మహిళల హక్కులను గౌరవించాలని, ఆడపిల్లల పట్ల లింగ వివక్ష చూపకూడదని అన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని ఆమె తెలిపారు. బాలికలపై లైంగిక వేధింపులు, మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు సంబంధిత సహాయ కేంద్రాలకు సమాచారం అందించాలని సూచించారు. బాధితులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మౌనిక, రమేష్ లు మాట్లాడుతూ, బాల్య వివాహాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకుండా, వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని వారు సూచించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు లేదా బాలలతో పనులు చేయిస్తున్నట్లు తెలిస్తే 1098 బాలల సహాయవాణికి సమాచారం అందించాలని వారు కోరారు. సర్పంచ్ సురగోని శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామంలో బాలల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ, బాల్య వివాహాలు వంటి ఘటనలు జరగకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. బాలబాలికలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జయమ్మ బ్రహ్మం, వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.






