భైంసా పట్టణంలోని గణేష్ నగర్ లో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ దున్నపోతులను అందంగా అలంకరించి, వాటిచే విన్యాసాలు చేయించడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా, ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, ఇద్రిజ్ బేగ్ లు మాట్లాడుతూ సదర్ ఉత్సవాల నిర్వహణ అభినందనీయమన్నారు. ఉత్సవాలకు వచ్చే సంవత్సరం నుండి మున్సిపల్ పాలకవర్గం తరఫున ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
భైంసా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మాస్టర్ ప్లాన్ పై అపోహలు నమ్మవద్దని, వారు ఎంఐఎం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రైతులను, నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.






