నిర్మల్ జిల్లా మండలంలోని బెల్తరోడ గ్రామంలో ధమ్మచక్ర పరివర్తన దిన వేడుకలను గ్రామ సర్పంచ్ గోపా సుజాత సాయినాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
బెల్తరోడ గ్రామంలో సమాజ బంధువులు నిర్వహించిన ఈ వేడుకల్లో సర్పంచ్ గోపా సుజాత సాయినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ధమ్మచక్ర పరివర్తన దినోత్సవం బౌద్ధ ధమ్మంలోని శాంతి, కరుణ, మానవత్వం వంటి విలువలను గుర్తుచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సమాజ బంధువులు పాల్గొన్నారు.











