కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. గురువారం బైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో 121 మందికి చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 69 మందికి కల్యాణ లక్ష్మి, 52 మందికి షాదీ ముబారక్ చెక్కులను అందించారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి ఇప్పటివరకు ఆరు దఫాలుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని, లబ్ధిదారులకు ఆలస్యం చేయకుండా త్వరిత గతిన అందిస్తున్నామన్నారు. దసరా పండుగ నేపథ్యంలో, పండుగ కంటే ముందే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్ష రూపాయలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీని నిలబెట్టుకోలేకపోతే, ఈ పథకం కింద అందించే మొత్తాన్ని లక్షా యాభై వేల రూపాయలకు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వల్లే బంగారం ధరలు పెరిగాయని, తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం అజ్ఞానమే అవుతుందని ఆయన అన్నారు. డాలర్ విలువ ప్రకారం బంగారం ధర పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం వాస్తవమేనని, అయితే అందులో ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వ వాటా ఐదు కిలోల బియ్యం అయితే, రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం ఒక కిలో బియ్యం మాత్రమేనని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. తనకు ప్రజలే ముఖ్యమని, ప్రజా శ్రేయస్సును కోరే వారిని స్వాగతిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిందని, ఆ మాటను నెరవేర్చి ఆడపడుచులకు డబ్బులను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. భైంసా పట్టణం, మండలంలో మరో 244 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 144 మందికి త్వరలోనే చెక్కులు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మోల్ల దత్తాత్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, బైంసా పట్టణ నాయకులు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, పెద్ద మొత్తంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.












