అనకాపల్లి జిల్లా మండలంలోని గబ్బాడ గ్రామంలో ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ గ్రామస్థులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసుల అవగాహన కార్యక్రమానికి స్పందించిన గ్రామ పెద్దలు, యువత కలిసి గ్రామంలోని రెండు కీలక ప్రాంతాల్లో నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో, గబ్బాడ గ్రామంలో ఎస్ఐ పి. రాజారావు నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలకు భద్రత, నేరాల నివారణ, సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
గ్రామ పెద్దలు, యువత చొరవ
పోలీసుల సూచనలతో స్పందించిన గ్రామ పెద్దలు ఈర్ల రాజబాబు, పెట్ల అప్పల నాయుడు, పోతల గణేష్, కొంచ బాల శంకర్, ఊట చిన్నబాయి, నడిగట్ల సత్తిబాబుతో పాటు గ్రామ యువత ప్రజా భద్రత కోసం ముందుకు వచ్చారు. తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు, నేరాలను నియంత్రించేందుకు వీలవుతుంది. ఏదైనా నేరం జరిగిన సందర్భంలో దర్యాప్తునకు అవసరమైన ఆధారాల సేకరణలోనూ ఇవి పోలీసులకు ఉపయోగపడనున్నాయి.
పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం ఉంటే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ప్రజల భద్రత కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గ్రామ పెద్దలు, యువతను రూరల్ పోలీసులు అభినందించారు.
ప్రజల భద్రతకు పోలీసుల బాధ్యత.. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం కీలకం అనే సందేశంతో గబ్బాడ గ్రామస్థులు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నించారు.











