బాసరలోని వేదభారతి పీఠం ఆధ్వర్యంలో ప్రతి శనివారం గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ వేద విద్యానంద గిరి స్వామీజీ సహకారంతో కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పుర ప్రముఖులు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
గోపూజలో భాగంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇస్తున్నారు. భక్తులు గోమాతకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోమాత అనుగ్రహంతో ఋణబాధలు, సకల దోషాలు తొలగిపోయి సత్సంతానం, శీఘ్ర కల్యాణం, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు గురుచరణ్ తెలిపారు.
గోహారతి కార్యక్రమం
గతంలో బాసర గోదావరి తీరంలో నిరంతరం గంగా హారతి నిర్వహించినట్లుగానే ప్రస్తుతం వేద విద్యాలయంలో ప్రతి శనివారం గోహారతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతి ఇంటింటా వేదం లక్ష్యం
వేద విద్యానంద గిరి స్వామి ఆధ్వర్యంలోని వేదభారతి పీఠం అభివృద్ధి ట్రస్టు ద్వారా వేద పాఠశాల, గోశాలను నిర్వహిస్తున్నారు. తాను రచించిన ప్రతి ఇంటింటా వేదం పుస్తకాన్ని శ్లోకాలు, సంకల్పంతో ప్రతి ఇంటికీ చేర్చడమే తమ సంకల్పమని స్వామీజీ తెలిపారు.
ప్రతి శనివారం నిర్వహిస్తున్న గోపూజ, గోహారతి కార్యక్రమాలతో బాసరలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోందని భక్తులు పేర్కొన్నారు.












