ఉపాధి కోసం ఒమన్ వెళ్లి మోసపోయానని నిర్మల్ జిల్లా మండలం కొత్త తార్ల గ్రామానికి చెందిన బోరు బొంతల నాగేష్ ఆరోపించాడు. బల్దియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఏజెంట్, చెప్పిన పని కాకుండా, సరైన జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయాడు.
మంచి ఉద్యోగం, మెరుగైన జీతం వస్తుందని ఆశపడి ఒమన్ దేశానికి వెళ్లిన నాగేష్ ప్రస్తుతం ఎడారిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ బల్దియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను ఒమన్‌కు తీసుకెళ్లాడని నాగేష్ ఆరోపించాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత చెప్పిన పని కాకుండా మరో పని అప్పగించారని, సరైన జీతం కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాను. ఏజెంట్ మాటలు నమ్మాను. ఒమన్‌లో బల్దియా ఉద్యోగం ఉందని చెప్పి నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెప్పిన పని కాకుండా మరో పని చేయించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదు అంటూ నాగేష్ కన్నీటితో తన గోడును వెల్లడించాడు. తన వద్ద ఉన్న పాస్‌పోర్టు, గుర్తింపు కార్డులను అక్కడి యజమాని తీసుకున్నాడని నాగేష్ చెబుతున్నాడు. సరైన జీతం ఇవ్వడం లేదని, తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మరో ప్రాంతంలోని ఖర్జూర తోటలో తలదాచుకుంటున్నానని తెలిపాడు.
సమయానికి తిండి దొరకడం లేదు. ఎన్నో రాత్రులు ఆకలితోనే గడిపాను. నీళ్ల కోసం కూడా ఇబ్బంది పడుతున్నాను. నా కుటుంబం గుర్తొస్తే ఏడుపు ఆగడం లేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తన పరిస్థితిని వివరిస్తూ భారత ప్రభుత్వానికి నాగేష్ కన్నీటి వేడుకోలు చేశాడు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా దగ్గర పాస్‌పోర్టు కూడా లేదు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా లేవు. నా కుటుంబాన్ని చూడాలని ఉంది. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి నన్ను సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలి. నన్ను ఆదుకుని నా కుటుంబం దగ్గరకు చేర్చాలి అంటూ రోదిస్తూ వేడుకున్నాడు. విదేశాల్లో ఉపాధి పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని నాగేష్ కోరుతున్నాడు. తనను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు.











