ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకుడు, యువకవి ఎ. కపిల్‌కు ఇటీవల వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి కవితా పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు వరుస సాహిత్య పురస్కారాలు, ప్రశంసా పత్రాలు లభించాయి.
తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కవితా పోటీలో ఎ. కపిల్ ప్రథమ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు గుర్రం జాషువా సేవా సౌరభం బిరుదును ప్రదానం చేశారు.
డాక్టర్ బోయి భీమన్న జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలో ప్రతిభ కనబరిచినందుకు డాక్టర్ బోయి భీమన్న చైతన్య దీప్తి బిరుదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఆర్గనైజేషన్ ఆఫ్ గ్లోబల్లీ యునైటెడ్ టీచర్స్ (ఓగట్) సాహితీ విభాగం నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు ప్రత్యేక ప్రశంసా పత్రం లభించింది.
ఈ సందర్భంగా ఓగట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. రాఘవరావు, రాష్ట్ర కార్యదర్శి కె. శంకర్రావు, మహిళా విభాగం బాధ్యులు పి.వి.ఎం. నాగజ్యోతి, గంపల బి.వి. గంగాభవాని ఎ. కపిల్‌ను అభినందించారు.
కళాశాల ప్రిన్సిపాల్ టి. ప్రతాప్‌సింగ్ మాట్లాడుతూ, బోధనతో పాటు సాహిత్య రంగంలోనూ ఎ. కపిల్ సేవలు అందిస్తూ పురస్కారాలు పొందడం కళాశాలకు గర్వకారణమన్నారు. తెలుగు విభాగాధిపతి ఎస్.కె. ముజీబ్ మాట్లాడుతూ, కపిల్ రచనల్లోని సాహిత్య పిపాస, సామాజిక స్పృహ పలువురికి స్ఫూర్తిదాయకమన్నారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. జి. సాయి ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు, సాహితీ మిత్రులు పాల్గొని ఎ. కపిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.











