రచయిత అనిల్ తొలి కథా సంపుటి జాడ తెలంగాణ పల్లె జీవితాన్ని, మట్టి మనుషుల మనసుల్లో మిగిలిన జ్ఞాపకాలను అక్షరాల్లోకి తీసుకొచ్చింది. తన చుట్టూ ఉన్న జీవితాన్ని, అనుభవాలను కథావస్తువులుగా మలిచి, పాఠకులను ఆలోచింపజేసే కథలను అందించారు.
కథ రాయడం అంటే కేవలం సంఘటనను అక్షరాల్లోకి మార్చడం మాత్రమే కాదు, కనిపించని జీవితాన్ని కనిపించేలా చేయడం. కాలం చెరిపేస్తున్న జ్ఞాపకాలకు చిరునామా ఇవ్వడం, మనిషి లోపలి సంఘర్షణకు గొంతు ఇవ్వడం. చదివిన కథ పాఠకుడిని వెంటాడి, అందులోని పాత్ర తనకు తెలిసిన మనిషిలా అనిపించి, కథ ముగిసిన తరువాత కూడా ఒక ప్రశ్న మిగిలితే, అక్కడే కథ తన అసలు ప్రయోజనాన్ని సాధించినట్లు. ఆ దిశగా సాగిన కథల సమాహారమే అనిల్ తొలి కథా సంపుటి జాడ.
అనిల్ తన కథల కోసం ఎక్కడికో వెళ్లి జీవితాన్ని వెతకలేదు. తన చుట్టూ ఉన్న మనుషులను చూశాడు. తాను నడిచిన దారులను, చూసిన పేదరికాన్ని, అనుభవించిన బాల్యాన్ని, మారిపోతున్న పల్లెను, బీటలు వారుతున్న బంధాలను కథావస్తువులుగా మలిచాడు. అందుకే ఈ కథల్లో కల్పనకంటే అనుభవం, అలంకారం కంటే ఆత్మీయత, ఆర్భాటం కంటే జీవితం ఎక్కువగా కనిపిస్తాయి.
జాడ సంపుటిలోని పదహారు కథలకు పదహారు నేపథ్యాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే అంతఃసూత్రం ఒక్కటే మనిషి.
జాడలో బాల్యం, స్నేహం, పల్లె జ్ఞాపకాలు ఒక జీవన మూలాన్ని వెతుకుతాయి. మనిషి ఎంత ఎదిగినా, ఎంత దూరం వెళ్లినా తన మూలాలను పూర్తిగా వదిలిపెట్టలేడనే భావన కథలో అంతర్లీనంగా ప్రవహిస్తుంది. రాణిలో వ్యక్తిత్వం కోల్పోయిన స్త్రీ అంతర్మథనం కనిపిస్తే, చిట్టి ప్రశ్నలో చిన్నారి అమాయకత్వమే పెద్దల సమాజాన్ని ప్రశ్నిస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కంటే వాటిని సమాజం ముందుంచడమే రచయిత బాధ్యత. అనిల్ అక్కడ అదే చేశాడు.
మూఢనమ్మకాలు, పేదరికంపై ప్రశ్నలు
ఉడుం, నల్ల కోడి వంటి కథల్లో మూఢనమ్మకాల వెనుక దాగిన భయాన్ని రచయిత ప్రశ్నిస్తాడు. పోయ్యల కట్టెలులో మండేది కట్టెలు మాత్రమే కాదు, పేదరికం కాల్చిన బాల్యం కూడా. కట్ట తెగిందిలో డబ్బు, బంధం, గౌరవం మధ్య మనిషి ఎక్కడ నిలబడుతున్నాడనే ప్రశ్న ఎదురవుతుంది.
సాంకేతికత, మానవ సంబంధాలు
వేలిముద్ర సాంకేతికత, మానవత్వం మధ్య పెరుగుతున్న అంతరాన్ని గుర్తుచేస్తుంది. యంత్రం మనిషి పనిని సులభం చేయవచ్చు కానీ, మనిషి స్థానాన్ని ఆక్రమించడం మొదలైతే సంబంధాల స్వరూపమే మారుతుంది. తోడులో సంపద, సౌకర్యాలన్నీ ఉన్నా మనసుకు మనిషి అవసరమేననే సత్యం కనిపిస్తుంది. దేవదాసి సామాజిక దురాచారాన్ని ప్రశ్నిస్తే, అన్న గడప కుటుంబ అనుబంధాల విలువను గుర్తుచేస్తుంది.
నేలతనం, ఆత్మీయత
మట్టి గోస ఈ సంపుటిలోని నేల గొంతు. రైతుకు మట్టితో ఉన్న సంబంధం కేవలం ఉపాధికి సంబంధించినది కాదు, అది తరాల అనుబంధం. రైతు చేతుల్లోని మట్టి అతని జీవన చరిత్ర కూడా. చిరునామా, చివరి కాల్ వంటి కథల్లో ఆధునిక జీవన వేగం మధ్య మనిషి కోల్పోతున్న ఆత్మీయతను రచయిత స్పృశించాడు.











