నిర్మల్ జిల్లా మండలం భోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ విగ్రహానికి ప్రత్యేక ఆకృతి ఉండటంతో పాటు నవరాత్రుల్లో నిర్వహించే పూజలు, దీక్షలు, అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
భోసి గ్రామస్తుల కథనం ప్రకారం, పూర్వకాలంలో గ్రామంలో మట్టి, జనుము నార, బియ్యం, వడ్ల బొంత సంచులను పగుళ్లు రాకుండా తయారు చేసే సంప్రదాయం ఉండేది. ఈ కళా సంప్రదాయానికి అనుబంధంగా నిర్మల్‌కు చెందిన నకాశీ కళాకారుడు పాలకొండ గుండాజీ 1963లో పోనికి కర్రతో ప్రత్యేకంగా వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. అప్పట్లో చిక్లి, పాలజ్, భోసి గ్రామస్తులు కలిసి నిర్మల్ కొయ్యబొమ్మల నుంచి ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేయించుకున్నట్లు స్థానికులు తెలిపారు. భోసి గ్రామస్తులు రూ.51 చెల్లించి ఈ విగ్రహాన్ని గ్రామానికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
గ్రామ తొలి సర్పంచ్ గుజ్జులవార్ (మంజ్రి) భూమన్న, అవుసలి ధర్మపురి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పట్లో పురాణ ప్రవచనాలు నిర్వహించే భూమన్న, ధర్మపురి స్వామివారికి శ్రీ వరసిద్ధి వినాయకుడుగా నామకరణం చేసినట్లు చెప్పారు.
కుడివైపు తొండం.. ప్రత్యేకత
భోసి కర్ర వినాయక విగ్రహానికి కుడివైపు తొండం ఉండటం ప్రత్యేకతగా భక్తులు భావిస్తున్నారు. స్వామివారిని మహిమలు కలిగిన శ్రీ వరసిద్ధి వినాయకుడిగా కొలుస్తూ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేసే సంప్రదాయం కూడా కొనసాగుతోంది.
దీక్షలు.. కాకడ హారతితో సేవలు
నవరాత్రుల సందర్భంగా అనేక మంది యువకులు, భక్తులు దీక్షలు చేపట్టి స్వామివారి సేవలో పాల్గొంటారు. ప్రతిరోజూ ఉదయం కాకడ హారతితో స్వామివారిని మేల్కొలిపి పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఊఠా ఉఠావో సకాలీక వాచే.. స్మరావ గజముఖ.. ఋద్ది సిద్ధి నాయక.. సుఖదాయక భక్తంచి అంటూ భక్తులు నామస్మరణ చేస్తూ స్వామివారిని ఆరాధిస్తారు. ప్రతిరోజూ పూజ, అభిషేకం, హారతి, నిత్య యజ్ఞం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అన్నదాన ప్రసాదం (భండారం) ఏర్పాటు చేస్తున్నారు.
స్వామివారి అనుగ్రహంతో అభివృద్ధి జరిగిందని విశ్వాసం
శ్రీ వరసిద్ధి వినాయకుడి ప్రతిష్ఠ అనంతరం గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండుతున్నాయని, గ్రామం సుభిక్షంగా ఉందని భోసి గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. స్వామివారి అనుగ్రహంతో గ్రామంలో 130 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, దీంతో భోసి విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందిందని స్థానికులు పేర్కొంటున్నారు. భోసి గ్రామానికి సుమారు 500 ఎకరాల రెవెన్యూ భూములు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. స్వామివారి అనుగ్రహంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు సుమారు వెయ్యి ఎకరాల భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి పథంలో సాగుతోందని తెలిపారు.
శ్రీ వరసిద్ధి వినాయకుడి విశిష్టత, మహిమలను విన్న భక్తులు నిర్మల్ జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా భోసికి వస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి సైతం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారుతున్నాయి. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు.












