తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఉన్నత స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అత్యాచార కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని, బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత అధికార విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు, అత్యాచార కేసుల పరిష్కారం, బాధితులకు అందాల్సిన పరిహారం తదితర అంశాలపై సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, సంక్షేమ పథకాల్లో వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. అత్యాచార కేసులు నమోదైన వెంటనే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, పెండింగ్లో ఉన్న కేసులను కూడా వేగంగా పరిష్కరించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో, ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం, పునరావాస చర్యలు కూడా సమర్థవంతంగా అందేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులను నూతన జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరంపై చర్చించగా, నూతన జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












