గోదావరి పుష్కరాలకు బాసరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బాసరలో పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పలు సూచనలు చేశారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సాధారణ పార్కింగ్తో పాటు వీఐపీ, వీవీఐపీ వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల రాకపోకల సామర్థ్యానికి అనుగుణంగా మార్గాల వారీగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అన్ని పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, రహదారులు-భవనాల శాఖ ఈఈ సుభాష్, తహసీల్దార్ పవన్ చంద్రతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. అనంతరం, కలెక్టర్ నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని కూడా పరిశీలించారు.











