గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. గురువారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్ చేశారు.
పది రోజుల గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. రేపు, ఎల్లుండి భారీ సంఖ్యలో నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందని, హైదరాబాద్‌తో జిల్లాల్లోనూ సీపీలు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సుమారు 30 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం మోహరించినట్లు వెల్లడించారు.
అన్ని శాఖల సమన్వయంతో
నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ, విద్యుత్, జలవనరులు, ఇతర ప్రభుత్వ శాఖలతో పోలీసుశాఖ సమన్వయంతో పనిచేస్తోందని డీజీపీ తెలిపారు. హుస్సేన్‌సాగర్‌తో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేశామని, ట్యాంక్‌బండ్‌పై అవసరమైన చోట్ల క్రేన్లను ఏర్ చేసినట్లు వెల్లడించారు.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో చోరీలు, మహిళల పట్ల వేధింపులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించామని, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
డీజేలు, బాణసంచా వద్దు
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, బాణసంచా వినియోగంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని డీజీపీ గుర్తుచేశారు. అధిక శబ్దాలతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఉత్సవ కమిటీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డీజేలు, బాణసంచాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని డీజీపీ సూచించారు.
సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలతో తనకు 13 ఏళ్ల అనుబంధం ఉందని డీజీపీ గుర్తుచేశారు. సుదర్శన్ గారు, ఇప్పుడు వారి అబ్బాయిలు సందీప్, రాజ్‌కుమార్, వారి కుమార్తె వీణా, మహేష్ యాదవ్, ఇతర సభ్యులు శాంతియుత నిమజ్జనాలకు సహకరిస్తారని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












