కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. నిమజ్జన బందోబస్తుపై జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
నిఘా, బందోబస్తు వివరాలు
శోభాయాత్ర కొనసాగే మార్గంలో 162 సీసీ కెమెరాలు, మూడు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధుల్లో 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన ట్రాఫిక్ కూడళ్లు, నిమజ్జన ఘాట్ల వద్ద అదనపు బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడింగ్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు మళ్లింపు చర్యలు చేపడతామన్నారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

