దుర్గా పూజ సందర్భంగా కోల్కతాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నియమించనున్న 20 వేల మంది వాలంటీర్లకు కాషాయ రంగు టీ షర్టులు, టోపీలు అందించే ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య లౌకిక విలువలకు విరుద్ధమని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విపక్షాలు, ప్రజాతంత్రవాదులు ఆరోపిస్తున్నారు.
దుర్గా పూజ సందర్భంగా అశేష జనం దుర్గాదేవి దర్శనార్థం కోల్కతా చేరుకుంటారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వం నగరాన్ని కాషాయమయం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ పూజా పర్వదినాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ పేరుతో 20 వేల మందిని వాలంటీర్లుగా నియమించాలని పోలీసు శాఖ యోచిస్తోంది. వారికి కాషాయ రంగు టీ షర్టు, టోపీలను యూనిఫారంగా అందించాలని ప్రతిపాదన ఉంది. ఇందుకోసం 89 లక్షల రూపాయల అంచనాతో టెండర్లను పిలిచింది.
కోల్కతా నగరంలో దుర్గా పూజను కాషాయమయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యను విమర్శకులు అత్యంత ప్రమాదకర ధోరణిగా అభివర్ణిస్తున్నారు. ప్రజలలో భక్తి భావాలు ఉండటం సహజం, ఆ సందర్భంగా వివిధ తీర్థయాత్రలకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పన కోసం, భక్తుల రక్షణ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్ల పేరుతో కాషాయ వస్త్రధారుల బృందాన్ని భక్తజన సమూహంలోకి పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పోలీసు శాఖను వినియోగిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. యూనిఫాం నెపంతో కాషాయ వస్త్రాల సరఫరా కోసం 89 లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుర్తింపు పేరుతో మోసం చేస్తున్నారని విమర్శలు
ఈ మేరకు పోలీసు శాఖ టెండర్లను కూడా పిలిచింది. పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, భక్త జనసమూహం వాలంటీర్లను సులభంగా గుర్తించడం కోసమే ఈ యూనిఫాం తెప్పిస్తున్నామని తెలిపారు. దీనిని పచ్చి మోసంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు.
అనేక రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులను స్కౌట్ డ్రెస్సులలో వినియోగించుకునే సంప్రదాయం ఉంది. అందుకు భిన్నంగా, ఇప్పుడు కాషాయ వస్త్రధారుల బృందాన్ని రంగంలోకి దింపి, వారికి కాషాయ వస్త్రాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అత్యంత ప్రమాదకరమని విమర్శకులు పేర్కొంటున్నారు.
లౌకిక విలువలకు విరుద్ధమని విమర్శలు
రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, రాజ్యాంగంలో నిర్దేశించిన లౌకిక విలువలకు విఘాతం కలిగిస్తూ, ఒక మతాన్ని ప్రోత్సహించే సంస్కృతికి ఒడిగట్టడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
గతంలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నవరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున జరిగేవి. అప్పుడు ప్రజలు తండోపతండాలుగా హాజరయ్యేవారు. అయితే, గత 30 ఏళ్ల పాలనలో వామపక్ష ప్రభుత్వం దసరా ఉత్సవాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక మత కార్యకర్తల ప్రయోజనాల కోసం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు.












