భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని బిఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రసంజీత్ హేమ్లే పిలుపునిచ్చారు. బైంసాలోని బుద్ధ విహార్లలో మంగళవారం ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో 70వ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా గౌతమ బుద్ధుడు, సామ్రాట్ అశోక చక్రవర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, దీప దూప పూజలు నిర్వహించారు. అనంతరం బౌద్ధ పంచశీల్ ధమ్మధ్వజ్, నీలి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసంజీత్ హేమ్లే మాట్లాడుతూ.. పంచశీల, పది పరమితాలు, ఆర్య అష్టాంగ మార్గాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. బుద్ధుడు బోధించిన శాంతి, అహింస, మైత్రి, కరుణ ప్రవచనాలను అందరూ ఆచరించాలని కోరారు. సామ్రాట్ అశోక చక్రవర్తి ఇదే రోజు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని, అదేవిధంగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్‌పూర్‌లో బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్నారని తెలిపారు. అంబేద్కర్ దీక్ష స్వీకరణ ఉద్దేశాన్ని వివరిస్తూ, చెడును వీడి మంచి మార్గంలో నడుచుకోవడమే పరివర్తన అని, ప్రతి ఒక్కరూ మహనీయుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమం చివరలో ఖీర్, అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఐ, ఎస్.ఎస్.డి డాక్టర్ ప్రసంజీత్ హేమ్లేతో పాటు కె. పరుశురాం, ప్రసాద్ హసడే, గంగాధర్ దగ్డే, దమ్మనంద్ దేవ్కే, అక్షయ్ గాయక్వాడ్, భగవాన్ సల్వే, గంగాధర్ వాగ్మారే, సత్వే విజయ్, దేవ, పవన్ ఆకాష్, ప్రజా ప్రతినిధులు, బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు, విపశ్యన సాధకులు, మాజీ శ్రామినర్లు, ఎస్.ఎస్.డి. సైనికులు, బౌద్ధాచార్యులు, కేంద్రీయ శిక్షకులు, బౌద్ధ దమ్మ అభిమానులు, సమస్త బౌద్ధ, అంబేద్కర్ సంఘాల నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు.











