ఐజేయూ)నిర్మల్ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 13
వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే, ఐజేయూ) నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా జారీ చేసిన ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఉత్తర్వులను వెంటనే అమలు చేసి, జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. ఈ విషయంలో మరోసారి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
విద్యాహక్కు చట్టం అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి, జర్నలిస్టుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. అలాగే, ఈ నెల 25వ తేదీన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నిర్మల్ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు గాండ్ల రాజశేఖర్, జిల్లా కోశాధికారి వీ. ప్రశాంత్, సామాజిక మాధ్యమాల విభాగం కన్వీనర్ యోగేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, వేణుగోపాల్, తక్కల రవీందర్, జిల్లా సంయుక్త కార్యదర్శి హనుమాన్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిన్పల్లి రవి, పూర్ణచంద్, షిండే మహేష్, డీఎస్ మధు, ప్రసాద్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



