కాకినాడ, 13 November
ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ మేయర్ అభ్యర్థిగా వైసీపీ అనూహ్యంగా తటస్థ వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసింది. పార్టీతో సంబంధం లేని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాడా వెంకటరమణ సతీమణి కాడా సత్యశ్రీని బరిలోకి దించింది.
ఆంధ్రప్రదేశ్లో మినీ స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు తెర లేచింది. వాయిదా పడిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవి వేటికవే ప్రతిష్టాత్మకమైనవి, అందులో జిల్లాలలోనే రెండు ఉన్నాయి. అవి రాజమహేంద్రవరం, కాకినాడ. ఇందులో కాకినాడను జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించారు. కాకినాడ జిల్లాలో జనసేన ప్రాబల్యం గట్టిగానే ఉంటుందని తాజా ఫలితాలు నిరూపించాయి. అందుకే వైసీపీ కూడా అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో జరిగే మేయర్ అభ్యర్థి కోసం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది.
తటస్థ అభ్యర్థిగా
పార్టీలోని కీలక నేతలలో ఒకరిని మేయర్ పదవికి పోటీ కోసం వైసీపీ ఎంపిక చేస్తుందని అందరూ అనుకుంటే, ఆ పార్టీ హైకమాండ్ ఆశ్చర్యకరంగా తటస్థ వర్గం నుంచి ఎంపిక చేసింది. పార్టీతో సంబంధం లేని ఒక డాక్టర్ కుటుంబం నుంచి మేయర్ సీటుకు పోటీకి అభ్యర్థిని నిలబెడుతోంది. అలా కాకినాడకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాడా వెంకటరమణ సతీమణి కాడా సత్యశ్రీని కాకినాడ మేయర్ అభ్యర్థిగా వైసీపీ ఎంపిక చేసింది. కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
పార్టీలో చేరగానే
పార్టీలో చేరగానే మేయర్ అభ్యర్థిగా కాడా సత్యశ్రీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో డాక్టర్ కాడా వెంకటరమణ తన సతీమణి కాడా సత్యశ్రీతో కలిసి పార్టీలో చేరారు. దీంతో త్వరలోనే వైసీపీ మేయర్ అభ్యర్థిగా సత్యశ్రీ నామినేషన్ను దాఖలు చేస్తారని అంటున్నారు. కాడా సత్యశ్రీ ఎంపిక వెనుక తూర్పు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య పాత్ర పోషించారని చెబుతున్నారు.
కూటమిని ఎదుర్కొనేందుకు
కాకినాడలో టీడీపీకి బలం ఉంది, జనసేనకు కూడా బలం ఉంది. పవన్ సొంత జిల్లా కావడం విశేషం, దీంతో గట్టి పోటీ ఉండనుంది. అందుకే పార్టీ ముఖాలను తీసుకుని వస్తే రొటీన్ అవుతుందని, అంతేకాకుండా కాకినాడ మేయర్ ఎన్నికలలో అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని, విద్యావంతులు, తటస్థుల మద్దతు తీసుకోవాలని వైసీపీ అనేక విధాలుగా ఆలోచించి ఈ ఎంపిక చేసిందని అంటున్నారు. అధికార కూటమికి ధీటైన పోటీ ఇవ్వవచ్చన్నది వైసీపీ వ్యూహంగా ఉందని అంటున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ప్రాంతీయంగా కూడా కాకినాడ మేయర్ సీటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. డాక్టర్ కుటుంబం ఈ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ ప్రదర్శన చేస్తుందో చూడాల్సి ఉంది. అదేవిధంగా వైసీపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి, జిల్లాలలో, ప్రత్యేకించి కాకినాడలో తన బలాన్ని ఎలా పెంచుకుంటుందో కూడా చూడాల్సి ఉందని అంటున్నారు.






