పదో తరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శుక్రవారం ఆయన మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, సౌకర్యవంతమైన వసతి కల్పించాలని, మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిరోజూ పూర్తి సంఖ్యలో పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న భోజనం, వసతులు, వివిధ సబ్జెక్టుల్లో సిలబస్ పూర్తయిన తీరు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సబ్జెక్టుకు తగిన సమయం కేటాయించి, ప్రణాళికాబద్ధంగా చదివి బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. సబ్జెక్టుల్లో సందేహాలుంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి బోర్డుపై గణిత సమస్యలను సాధింపజేశారు. సమస్యలను సరిగ్గా పరిష్కరించిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులను బహుమతులుగా అందజేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












