జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
గొల్లపల్లిలో జరిగిన ఈ సంఘటనపై తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై అధికారుల వేధింపులు, బోధనేతర పనుల భారం, అంతర్జాల ఆధారిత పనుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడిని తగ్గించి, బోధనకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఆయన కోరారు. ఆన్లైన్ ప్రక్రియల పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి, బోధనేతర పనుల భారం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టును వెంటనే మంజూరు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఒకరిద్దరు ఉపాధ్యాయులతో ఐదు తరగతులను నిర్వహించాల్సి రావడం వల్ల పని భారం, మానసిక ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉపాధ్యాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధితుడికి తమ సంఘం అండగా ఉంటుందని వెనిగళ్ల సురేష్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.












