విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షల మంది విద్యార్థులకు హార్ట్ ఫుల్ యోగా శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యానికి సంబంధించి అవగాహన, సంస్థాగత మద్దతు, మార్గదర్శకత్వం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మిషన్ మోడ్ లో ప్రారంభించాలని సూచించారు.
దీనిపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు స్పందిస్తూ, విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం కేర్ ఎపి టూల్ ను సిద్ధం చేశామని, పైలట్ కూడా పూర్తయిందని తెలిపారు. హార్ట్ ఫుల్ యోగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షలమంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
శ్రీనివాసరావు మాట్లాడుతూ, హైదరాబాద్ లోని కన్హా శాంతి వనం అనే సంస్థ ద్వారా 2వేలమంది ఔత్సాహిక ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబోతున్నామని చెప్పారు. వీరిద్వారా ఈ ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో, వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కుప్పం లోని అగస్త్య సైన్స్ ఫౌండేషన్ లో ఔత్సాహిక సైన్స్ ఉపాధ్యాయులకు జరగనున్న శిక్షణ గురించి కూడా వివరించారు.
ఇప్పటివరకు పాఠశాల విద్యలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై అధికారులు ఫలితాలపైనే పూర్తిగా దృష్టి సారించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లలో 90శాతం ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని, కీలక పనితీరు సూచికలు () లక్ష్యాలను అధిగమించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతం మెరుగుదలకు ఎఫ్ఆర్ఎస్ () ను అమలు చేయాలని సూచించారు.
మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్న ఉపాధ్యాయులను, అధికారులను మంత్రి లోకేష్ అభినందించారు. పాఠ్యాంశాల బోధనలో వెనుకబడిన సబ్జెక్టు టీచర్లకు మెంటార్ టీచర్లతో సామర్థ్య నిర్మాణం తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో వచ్చే ఏడాది చివరికి నూరుశాతం అక్షరాస్యత సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం అని, నిర్ణీత లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై సమీక్షిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పిఎం సేతు పథకం ద్వారా పారిశ్రామికవేత్తల సహకారంతో తొలివిడతగా 10 పారిశ్రామిక అనుసంధానిత క్లస్టర్లను అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం స్టీల్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆక్వా, ఫార్మా సంస్థలతో సంప్రదించి, 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
స్కిల్ డెవలప్ మెంట్ ఎండి గణేష్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5.43 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించామని, గత రెండేళ్లుగా జాబ్ మేళాల ద్వారా 1.72 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. జాబ్ మేళాల నిర్వహణలో శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి లోకేష్ సూచించారు.












